మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్
హైదరాబాద్: మహానగరంలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాన్ షాపులను అడ్డాగా చేసుకుని చిన్నారులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 5 వేలకు పైగా గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాన్ షాప్ ముసుగులో మత్తు పదార్థాలను విక్రయిస్తూ చిన్నారులు, యువతను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకు చాక్లెట్ల రూపంలో అందుబాటులోకి వస్తుండటంతో యువతపై వీటి ప్రభావం పెరుగుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ చాక్లెట్లు సరఫరా అవుతున్నాయి? మరెంతమంది ఈ దందాలో ఉన్నారు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. చిన్నారులు, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టడి చేసేందుకు పాన్ షాపులు, అనుమానాస్పద విక్రయ కేంద్రాలపై నిఘా పెంచాలని పోలీసులు నిర్ణయించారు.






