25 July, 2026 | 8:51 PM

జేవీఆర్ సీహెచ్‌పీని సందర్శించిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

25-07-2026 08:15 PM

- కోల్ రవాణా విస్తరణ అవకాశాలపై ఉన్నతస్థాయి సమీక్ష

– మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం

సత్తుపల్లి,(విజయక్రాంతి): మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ (రైల్వే బోర్డు) ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేషన్ (కోల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ రహమాన్ జేవీఆర్ సీహెచ్‌పీని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కోల్ రవాణా వ్యవస్థను పరిశీలించి, భవిష్యత్తులో రైల్వే మార్గం ద్వారా బొగ్గు రవాణాను మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా శ్రీ సయ్యద్ అబ్దుల్ రహమాన్, శ్రీ బి. వెంకన్న (ఐఆర్‌టీఎస్), సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.

అనంతరం జేవీఆర్ సీహెచ్‌పీలోని సైలో బంకర్, రైల్వే లోడింగ్ పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. సత్తుపల్లి ఏరియా నుంచి రైల్వే మార్గం ద్వారా జరుగుతున్న కోల్ డిస్పాచ్, రవాణా సామర్థ్యం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై శ్రీ బి. వెంకన్న (ఐఆర్‌టీఎస్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) & ఎఫ్‌ఏసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, శ్రీ డి. నరేంద్ర వర్మ, సీనియర్ డివోఎం, సికింద్రాబాద్ డివిజన్, అలాగే సత్తుపల్లి ఏరియా జీఎం శ్రీ చింతల శ్రీనివాస్ సమగ్ర వివరాలను అందించారు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో రైల్వే మార్గం ద్వారా కోల్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా సామర్థ్యాన్ని పెంచే అంశాలపై విస్తృతంగా చర్చించారు.