25 July, 2026 | 9:04 PM

ప్రియుడి ఇంటి ఎదుట ప్రేమికురాలి నిరసన

25-07-2026 08:08 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని ఆరోపిస్తూ జగ్గారం గ్రామానికి చెందిన ఓ యువతి అశ్వాపురం మండల కేంద్రంలోని కాల్వబజార్‌కు చెందిన నూకల నవీన్‌ ఇంటి ఎదుట శనివారం టెంట్‌ వేసుకుని నిరసన చేపట్టింది. గత మూడేళ్లుగా నవీన్‌ తనను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో తనకు అన్యాయం జరిగిందని బాధితురాలు ఆరోపించింది.

యువతి వస్తున్న విషయం తెలుసుకున్న నవీన్‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నాయకురాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని యువతికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఆరోపణలపై మరో పక్షం స్పందన తెలియాల్సి ఉంది. ఇరువర్గాల వాదనలు తెలుసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.