George Kurian resigns: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా
- కేంద్ర మంత్రి మండలిలో కీలక పరిణామం
- కేంద్ర సహాయ మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా
- జార్జ్ కురియన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) సీనియర్ నాయకుడు జార్జ్ కురియన్(Union Minister George Kurian resigns), తన ఆరేళ్ల రాజ్యసభ పదవీకాలం ముగియడంతో మంగళవారం నాడు కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్యశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సలహా మేరకు, కేంద్ర మంత్రిమండలి నుంచి జార్జ్ కురియన్(George Kurian resigns) సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదించారు." అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
65 ఏళ్ల కురియన్ 2024 ఆగస్టు నుండి ప్రధాని మోదీ నేతృత్వంలోని మూడవ కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా (MoS) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం నాటి నుంచే ఇందులో సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన, భారత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. కురియన్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరు కారణంగానే ఆయనను తిరిగి నామినేట్ చేయలేదని సమాచారం. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, కురియన్ 1960 సెప్టెంబర్ 20న కేరళలోని కొట్టాయం జిల్లా, ఎట్టుమనూర్ మున్సిపాలిటీ పరిధిలోని నంబియాకులంలో జన్మించారు.
ఆయన తన స్వస్థలంలోనే పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత న్యాయశాస్త్రంలో (Law) పట్టభద్రులయ్యారు. పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 జూన్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, 2024 జూన్ 11న మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖలలో బాధ్యతలు చేపట్టారు. దీనికి ముందు, కురియన్ జాతీయ మైనారిటీల కమిషన్ వైస్-చైర్మన్‌గానూ, అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఓ. రాజగోపాల్‌కు 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' (OSD)గానూ విధులు నిర్వహించారు.






