వర్షాకాలం విష సర్పాలతో జాగ్రత్త
కొత్తగూడెం, జూన్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురిసిన వేళ జనావాసాల్లో,పాములు అధికంగా తిరుగుతాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ తెలిపారు. గత రెండు రోజుల్లోనే 7హిల్స్ ఏరియా, ప్యూన్ బస్తీ, రామవరం, బాబుక్యాంప్, బర్మా క్యాంప్, పాల్వంచ ప్రాంతాల్లో 6 విష సర్పాలు 3 విష రహిత సర్పాలు బంధించి, అడవి లో వదిలినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, ప్రత్యేకించి వర్షాకాలంలో సర్పాలకు ఆహారం, సంతానం కోసం ఎక్కువగా బయటికి వస్తాయని,ఇంటి పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని, పాములకు ఆవాసం లేకుండా పనికిరాని వస్తువులు తొలగించాలని, రాత్రులు వెలుగు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కాళ్లకు గమ్ షూస్ ధరించటం, రాత్రుళ్ళు టార్చ్ లైట్ వినియోగించడం మంచిదని సూచించారు. పాములు సంచరించే ప్రాంతంలో, అవకాశం ఉంటే పాము ను ఫోటో తీయడం లేదా పాము యొక్క గుర్తులు చెప్పడం వల్ల, అది విషపూరితమా, విషరహితమా, చెప్పే అవకాశం ఉంటుందని, స్థానికులను వెంటనే అప్రమత్తం చేయడానికి వీలు ఉంటుంది అని తెలిపారు.






