గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లోని(Gudimalkapur) వింటేజ్ ఫంక్షన్ హాల్(Vintage Function Hall) సమీపంలో ఉన్న ఒక ఫర్నిచర్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వర్క్‌షాపులలో మండే స్వభావం గల పదార్థాలు ఉండటం వల్ల మంటలు భారీగా వ్యాపించి, పక్కనే ఉన్న రెండు ఫర్నిచర్ యూనిట్లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే, గుడిమల్కాపూర్ పోలీసులు(Gudimalkapur Police), అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, నాలుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గంటల పాటు శ్రమించి, మంటలు సమీపంలోని భవనాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురాగలిగారని స్థానికులు తెలిపారు. కుల్సుంపుర ఏసీపీ తిరుపతి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






