24 July, 2026 | 9:54 PM

నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

24-07-2026 09:09 PM

సీపీఎం మండల కార్యదర్శి ఎన్.సబిత

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఢిల్లీలో సుమారు 26 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన దీక్ష శాంతియుత ప్రదర్శన చేపట్టిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన కేంద్రం సర్కార్ పై పోరాటానికి విద్యార్థి యువతరం అందరం అండగా నిలబడదామని సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ సర్కిల్ రాజీవ్ గృహకల్ప అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులపై  ఎన్ ఎస్ ఏ లాంటి కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమే అని పేర్కొన్నారు.

నీట్ సహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.