24 July, 2026 | 10:28 PM

పోలీసు సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ తరగతులు

24-07-2026 09:46 PM

• రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్. 

• ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి రిత్య నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. 

• శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్.

మునిపల్లి,(విజయక్రాంతి):  జిల్లా పోలీసు సిబ్బందిలో వృత్తిరిత్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు వోక్సెన్ యూనివర్సి నిర్వహిస్తున్న రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తిచేసుకున్న పోలీసు సిబ్బందికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో సిబ్బంది ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. ఎంఎస్ ఆఫీస్, ముఖ్యంగా వర్డ్, ఎక్సెల్ వంటి సాఫ్ట్‌వేర్‌లలో ప్రావీణ్యం పెరగడం ద్వారా కార్యాలయ పనితీరులో వేగం, ఖచ్చితత్వం, సమర్థత మరింత మెరుగుపడుతుందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు మొత్తం 180 మంది సిబ్బందిని 3 బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు 3 రోజుల చొప్పున శిక్షణను అందించడం జరుగుతుంది అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను రోజువారీ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ పనితీరును మెరుగుపరచుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో సేవల నాణ్యతను పెంచడంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తొలి బ్యాచ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. వోక్సెన్ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లకు పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వోక్సెన్ యూనివర్సిటీ డీన్ డా. దయాశంకర్, అసిస్టెంట్ డీన్స్, ప్రొఫెసర్స్, జిల్లా పోలీసు అధికారులు, శిక్షణ పొందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.