నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వానిదే బాధ్యత
కొత్తపల్లి,(విజయక్రాంతి): నీట్ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు జక్కనపల్లి గణేష్ డిమాండ్ చేసారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు, విద్యార్థి ఉద్యమకారులు గత మూడు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తుంటే, వారిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాషవికంగా లాఠీఛార్జ్ చేయించి, బాష్పవాయువు ప్రయోగింపచేసి, పెల్లెట్ల వర్షం కురిపింపచేసి దమనకాండ సృష్టించిందన్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ వల్ల మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థి, యువజన, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడకపోతే తీవ్రస్థాయి ఉద్యమాలకు తెరలేపుతామన్నారు.






