9 August, 2026 | 2:53 AM

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం

09-08-2026 12:39 AM
  1. పరిష్కారానికి సీఎం రేవంత్ హామీ
  2. ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి

కామారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేంతవరకు రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో జిల్లా పీఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కొన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.

పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలను చెల్లింపు, ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీఓ 25ను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్రంలో ఏకైక సంస్థ పీఆర్టీయూ అని రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం ఖాయమని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి హెచ్చరించారు.

నూతన పీఆర్టీయూ అధ్యక్షునిగా కుశాల్కర్, ప్రధాన కార్యదర్శి పుట్టా శ్రీనివాస్ రెడ్డి, మండల కమిటీలను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడాన్ని దామోదర్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాధ్యులు వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, గోవర్ధన్, హనుమాన్లు, జిల్లా బాధ్యులు, మండల పీఆర్టీయూ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.