సీబీఎస్‌ఈపై సైబర్ ఎటాక్
- రీవాల్యుయేషన్ పోర్టల్‌లో 50 మంది అనధికారిక లాగిన్
- మరో నాలుగు బ్యాంకుల పేమెంట్ గేట్‌వేల అనుసంధానం
న్యూఢిల్లీ, మే 30: సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌పై సైబర్ దాడి జరిగింది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్ అయ్యారు. హ్యాకింగ్ వివరాలను పలువురు అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) పద్ధతి కారణంగా తమ సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, సరిచూసుకోవాలని అనుమానాలుంటే రీవాల్యూయేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. రీవాల్యుయేషన్ కోసం చెల్లించాల్సిన పేమెంట్ పోర్టల్‌పైనే తాజాగా సైబర్ దాడి జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చెల్లింపుల్లో హెచ్చు, తగ్గులున్నట్లు, హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపుల్లోనే ఈ సమస్యలు ఎదురైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సైబర్‌దాడిపై అధికారులు అప్రమత్తమై ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిపుణులు అధికారుల సూచనల మేరకు ఎస్‌బీఐ, కెనరాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేమెంట్ గేట్‌వేలను సీబీఎస్‌ఈ పోర్టల్‌కు అనుసంధానించారు. మొత్తం చెల్లింపుల ప్రక్రియను ఐఐటీ సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.






