17 August, 2026 | 7:44 PM

రత్నాపూర్‌–రామగిరి ఖిల్లా రహదారి వెడల్పునకు ఏకగ్రీవ తీర్మానం

17-08-2026 06:51 PM

మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలతో గ్రామసభ కీలక నిర్ణయం

రామగిరి, ఆగస్టు 17 (విజయక్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్‌ నుంచి రామగిరి ఖిల్లా వరకు ఉన్న రహదారిని వెడల్పు చేసేందుకు రత్నాపూర్‌ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం సర్పంచ్‌ పల్లె ప్రతిమ–పీవీ రావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.

రామగిరి ఖిల్లా ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు 280 ఎకరాల భూమిని సేకరించిన నేపథ్యంలో రహదారి విస్తరణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ ప్రాంతంలో పర్యటించి రహదారి వెడల్పు చేయాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈ నేపథ్యంలో సర్పంచ్‌ పల్లె ప్రతిమ–పీవీ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామ పరిధిలో 25 అడుగుల మేర రహదారికి స్థలం ఇచ్చేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం అనంతరం రహదారి విస్తరణకు సంబంధించిన ప్రాంతంలో వెంటనే మార్కింగ్‌ చేపట్టారు. గ్రామసభ తీర్మానం ప్రతిని జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.

రహదారి విస్తరణతో రామగిరి ఖిల్లా ప్రాంతంలో ప్రతిపాదిత పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు, రత్నాపూర్‌ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అభివృద్ధి కోసం గ్రామస్తులు స్వచ్ఛందంగా స్థలం ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ భాద్రపు ప్రవళిక–ప్రశాంత్, కార్యదర్శి గంగుల సంతోష్, వార్డు సభ్యులు పబ్బ స్రవంతి–వెంకటేష్, జక్కుల పద్మ–చందన్‌కుమార్, కెక్కర్ల ఉష–అశోక్, కండే లక్ష్మి–గట్టయ్య, కండే సాహితీ–పోశం, అల్లి రమేష్, బత్తిని ప్రశాంత్, పున్నం మని తేజతో పాటు వివిధ పార్టీల నాయకులు సందవేన కుమార్, కొండు లక్ష్మణ్, ధర్ముల వెంకటేష్, కొవ్వూరి సురేష్, భాద్రపు కృష్ణమూర్తి, కొండు అంజన్న, జీకే యాదవ్, కనవేన సదానందం, పబ్బ మొగిలి, బొంగురాల రవి, ఇజ్జగిరి సంపత్, దాసరి మల్లి తదితరులు పాల్గొన్నారు.