విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చివ్వెంల, మే 7 : విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రెండు వేరువేరు సంఘటనలో జరిగింది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాల్య తండాకు చెందిన ధారవత్ అనూష (25), భర్త రామచందర్, ఉదయం ఇంట్లో బట్టలు ఇనుప తీగపై ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురైంది. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే కోమటికుంట గ్రామానికి చెందిన పిట్టల దినేష్ (19), తండ్రి సైదులు, తన అక్క పెళ్లి పనుల్లో భాగంగా ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఉదయం సుమారు 11 గంటల సమయంలో కరెంట్ షాక్కు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెళ్లి సంబరాలు జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొనడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు చివ్వెంల ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






