8 May, 2026 | 1:05 AM

జిల్లాలో బెల్ట్ జోరు

08-05-2026 12:00 AM
  1. గల్లీకో మద్యం దుకాణం 
  2. మద్యం కావాలంటే డిపాజిట్ చేయాలి 
  3. సిండికేట్ షాపు నుంచే మద్యం సరఫరా 
  4. ప్రజల ప్రాణాలతో చెలగాటం
  5. నిద్రావస్థలో ఎక్సైజ్ శాఖ

భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పరిధిలో బెల్ట్ షాపుల జోరు పగలు రాత్రి తేడా లేకుండా సాగుతోంది. ఏటీఎంలో నగదు దొరుకుతుందో లేదో కానీ, బెల్ట్ షాపుల్లో ఎనీ టైం మద్యం (ఏటీఎం) లభిస్తుంది అన్నట్లు ఉంది బెల్ట్ జోరు. కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో మద్యం దుకాణాలు ఏటీఎంలను (ఎనీ టైం మద్యం) తలపిస్తున్నాయి. 

కిరాణా షాపులు, కిల్లికోట్లు, చివరకు టీ షాపుల్లోనూ మద్యం ఏరులై పారుతున్న సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాల కు సిండికేట్ హస్తం దండిగా ఉందని తెలుస్తోంది. ఒక్కో షాపు నుంచి నెలవారీగా వసూలు చేస్తూ ఆ సొమ్ములో సింహభాగం ఎక్సైజ్ శాఖలోని కొందరి అధికారుల జేబుల్లోకి చేరుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

మద్యం కావాలంటే డిపాజిట్ చేయాల్సిందే 

కొత్తగూడెం నియోజకవర్గంలో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయాలంటే ప్రతి షాపు రూ 5,నుంచి రూ 6వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. పది రోజులకు ఒకసారి మధ్యాహ్నం సీసాలపై ధరలు పెంచి దండుకుంటున్నారని, డిపాజిట్ చేసిన షాపు యజమానులకే మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా వారానికి ఒకసారి మద్యంపై ధరలను పెంచి దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాభాలు సిండి కేట్లు  పరం, చాకిరి బెల్ట్ షాపుల యజమానులది అన్నట్లుగా సాగుతుంది అక్రమ మద్యం దందా. 

సిండికేట్ కార్యాలయం నుంచే మద్యం సరఫరా 

వాస్తవంగా ప్రభుత్వం వేలం పాట నిర్వహించిన మద్యం దుకాణం నుంచి మద్యం విక్రయించాల్సిన నిబంధన ఉంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ పరిస్థితికి భిన్నంగా మద్యం వ్యాపారులంతా ప్రత్యేకంగా సిండికేట్ కార్యాలయం ఏర్పాటుచేసి, అక్కడ నుంచి మద్యం సీసాలను నిబంధనలకు విరుద్ధంగా  సరఫరా చేస్తున్నారు. అక్రమ మద్యం అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు సిండికేట్లు ఇచ్చే మామూళ్ల మత్తులో తూలుతూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరై నా మద్యం బారిన పడీ ఇబ్బందులు కలిగిన వారు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు దాడు లు నిర్వహించి మామ అనీ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.

చిన్నాభిన్నమవుతున్న సామాన్యుడి జీవితాలు

గల్లి గల్లి కి విస్తరించిన మద్యం దుకాణాల వల్ల సామాన్యుల జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఇండ్ల మధ్యనే మద్యం దుకాణాలు ఉండటం వల్ల మద్యం ప్రియులకు వేళ్ళ పాల లేకుండా మద్యం సేవించి అనారోగ్య బారిన పడుతున్నారు. సంపాదించిన సంపాదనలో మూడు వంతులు మద్యం దుకాణాలకే ధారపోయటంతో, ఇల్లు గడపడమే కష్టంగా మారిందని మహిళలు వాపోతున్నారు. అధికారులు మాత్రం మద్యం దుకాణాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని బెల్టు షాపుల పై నియంత్రణ చర్యలు చేపట్టాలని, అక్రమ్ సిండికేట్ల దందా పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.