ప్రజల చూపు బీఆర్‌ఎస్ వైపు
- ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- ఢిల్లీకి పయనం అవ్వడమే రేవంత్ రెడ్డి పని
- కాలేశ్వరం ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీరు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది.
- పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
- కోదాడ బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజం
కోదాడ, మే 7 : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, శాసనసభ మాజీ ఉపాధ్యక్షుడు తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోనీ గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి భారాస విస్తృత సాయి సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. రైతు, మహిళ, యువత, నిరుద్యోగి ఆశలు నెరవేర్చడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతుబంధు ఆపకుండా రైతులకు అండగా నిలిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుదేనని హరీశ్రావు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించి రైతును కాపాడిన ప్రభుత్వం భారాసేనని గుర్తుచేశారు. రైతు సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, రాష్ట్ర సమస్యలను పక్కనబెట్టి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి, సంక్షేమం కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతాలైన మునగాల, మోతె, నడిగూడెం ప్రాంతాలకు సాగునీరు అందించిన ఘనత భారాస ప్రభుత్వానిదేనని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిందని తెలిపారు.పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలే ప్రధాన బలమన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలపరిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు మునగాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. తిమ్మారెడ్డిగూడెంలో పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా మహోత్సవం, పూజల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎర్రోళ్ల సంతోష్, మాజీ ఎమ్మెల్యేలు కుసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్య క్షుడు బడుగుల లింగయ్యా యాదవ్, రాకేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ నయం, తోగరు రమేష్, చింత కవితా రెడ్డి, శెట్టి సురేష్ నాయుడు, కార్యకర్తలుపాల్గొన్నారు






