13 March, 2026 | 7:36 PM

ఏది అసలు.. ఏది నకిలీ ?!

13-03-2026 05:23 PM

ఒకే వ్యక్తికి రెండు కుల సర్టిఫికెట్స్

అధికారుల తీరుపై విమర్శలు

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలంలో కొందరికి రెండు కుల సర్టిఫికెట్లను జారీ చేసిన సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2017 నవంబర్ 16 వ తేదిన మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన వై.ఈశ్వర్ చంద్ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో ప్రధమ శాఖ నియోగి, ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో నియోగి, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ అనే వ్యక్తి 2018 ఫిబ్రవరి 21న బ్రాహ్మణ కులంలో నియోగి అని కుల ధృవీకరణ పత్రాలు పొందారు.

అదే ముగ్గురు వ్యక్తులలో వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే ఇద్దరు 2025 నవంబర్ 28 న, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ 2025 నవంబర్ 25 న బ్రాహ్మణ కులంలో శ్రీ వైష్ణవ అని కుల ధృవీకరణ పత్రాలు పొందారు. ఈ ముగ్గురు వ్యక్తులకు గతంలో ఒక కులంలో ఒక కేటగిరీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం, ఆ ముగ్గురికే ఇటీవల అదే కులంలో మరో కేటగిరీ కుల ధృవీకరణ పత్రం జారీ చేశారు.

ఒకే వ్యక్తికి రెండు వేరు వేరు కేటగిరీలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన విషయంలో రెవెన్యూ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు సర్టిఫికెట్లలో వారికి పేర్కొన్న కులం కేటగిరి ఏమిటన్నది రెవెన్యూ అధికారులకే తెలియాలని, ఒకే వ్యక్తికి రెండు కులాల ధృవీకరణ  పత్రాలు జారీ చేయడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య పని తీరుకు నిదర్శనమని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: పోలెబోయిన ఆదినారాయణ, ఆదివాసి సేన మండల అధ్యక్షుడు

మంగపేట తహసీల్ ఆఫీస్ గత కొన్నేండ్లుగా అవకతవకలకు, అక్రమాలకు అడ్డగా మారింది. తహసీల్ కార్యాలయంలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిభంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఒకరిద్దరు ఆఫీసర్ల తీరు అక్రమాలకు పాల్పడే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వేర్వేరు కేటగిరీలో జారీ చేసిన కుల దృవీకరణ పత్రాల అంశంలో కనబడుతుంది.

మల్లూరు గ్రామంలో ముగ్గురు వ్యక్తులకు గతంలో ఒక రకంగా, ఇటీవల మరో రకంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం అధికారుల నిర్లక్ష్య తీరుకు నిదర్శనంగా కనబడుతుంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తప్పుగా పొందిన కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయాలి. వేరు వేరు కేటగిరీలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి. వేరు వేరు కేటగిరిలో కుల ధృవీకరణ పత్రాలను పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.