29 July, 2026 | 1:03 AM

కాంగ్రెస్‌లో పదవుల ముసలం..

29-07-2026 12:00 AM
  1. మండల అధ్యక్షుల నియామకాలపై భగ్గుమంటున్న అసంతృప్తి
  2. ఎస్సీలకు ప్రాధాన్యం ఎక్కడ?
  3. గ్రామీణ కార్యకర్తలకు అన్యాయం
  4. సోషల్ మీడియాలో కార్యకర్తల ఆవేదన

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రకటించిన అసిఫాబాద్ నియోజకవర్గంలోని మండల అధ్యక్షుల నియామకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నియామకాల ప్రకటన వెలువడినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కెరమెరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకాన్ని వెంటనే పునఃసమీక్షించాలని మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఆత్రం లక్ష్మణ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలతో సంబంధం లేని, గతంలో బీఆర్‌ఎస్కు అనుబంధంగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.

పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలను పక్కనబెట్టి ఇలాంటి నియామకాలు చేయడం వల్ల కాంగ్రెస్కు రాజకీయంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆసిఫాబాద్ మండల అధ్యక్ష పదవిని గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయకుడికి కాకుండా మున్సిపల్ పరిధికి చెందిన వ్యక్తికి ఇవ్వడంపై గ్రామీణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా  ఆసిఫాబాద్ మండలం అధ్యక్ష పీఠానికి పట్టణ నాయకత్వానికే ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవసరమైతే సామూహిక రాజీనామాలకు కూడా సిద్ధమని కొందరు హెచ్చరిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండల అధ్యక్షుల నియామకాల్లో ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించకపోవడంపై దళిత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ మండల స్థాయి పార్టీ పదవులలో దళితులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో కూడా పార్టీ పాత కార్యకర్తల ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసిన  కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని విమర్శిస్తున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ జెండా మోసిన వారే నిజమైన సీనియర్లని, పార్టీ బలపడిన తర్వాత వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం వల్ల అసలు కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికల సమయంలో కార్యకర్తలను భుజాన వేసుకుని తిరిగే నాయకత్వం, పదవుల పంపకాల సమయంలో మాత్రం వారిని పూర్తిగా విస్మరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు లేకపోతే కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుందని, భవిష్యత్తులో పార్టీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ంగ్రెస్లో నెలకొన్న ఈ అసంతృప్తి నాయకత్వానికి సవాల్గా మారింది. కార్యకర్తల అభ్యంతరాలపై జిల్లా నాయకత్వం స్పందించి నియామకాల విషయంలో పునరాలోచన చేస్తుందా, లేక యథాతథంగా కొనసాగుతుందా అన్నది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.