జోరు వాన... ఉప్పొంగిన వాగులు
* ఏజెన్సీలోని పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..
* ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఉట్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, సిరికొండ మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. వర్షాకాలం ప్రారంభం నుండి వర్షాలు లేక వేల వేల పోతున్న కుంటలు, చెరువుల్లోకి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయానికి బోర్లు వాడకం తగ్గి, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది.
ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలకు అడ్డంకిగా ఉన్న వాగులు పొంగిపోవడంతో ప్రజలలో వాగులు దాటి బయటకు రాకుండా, బయట నుంచి గ్రామాలకు వెళ్లకుండా జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ల ఆదేశాల మేరకు రెవిన్యూ, పోలీస్ శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తమై వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాగులపై ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, ఎరుపు రంగు రిబ్బన్లను ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ స్వయంగా వాగుల వద్దకు వెళ్లి పరిశీలించారు.
సిరికొండ మండలంలోని రాంపూర్ నుండి సిరికొండకు వచ్చే రోడ్డుపై నిర్మించిన రోడ్డు డ్యాం పై నుంచి వరద నీరు ప్రవహించడంతో సిరికొండ మండల ప్రత్యేక అధికారి పనిందర్రావు వాగును పరిశీలించి మూడు రోజులపాటు రాకపోకలను నిషేధిస్తూ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ ఉట్నూర్ మండలంలోని మత్తడి గూడ, గంగాపూర్ తదితర గ్రామాలకు ప్రవహించే వాగులను పరిశీలించి వాగుల పక్కన ఉన్న గ్రామాల వారు రాకపోకలు చేయవద్దని వారికి సూచనలు చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.
ఇంద్రవెల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ సత్వజిగూడ వాగును పరిశీలించి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిదరి ఖానాపూర్, అల్లికోరి, ఇంద్రవెల్లి మండలంలోని మార్కా గూడా పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు వాగు దాటకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు గ్రామపంచాయతీ సిబ్బందిని వాగు వద్ద ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మండల ఎంపీ ఓ సంజీవరావు వడగామ పంచాయతీ పరిధిలోని జైత్రంతాండా, జెండాగూడ, హార్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడి గూడ (జి) గ్రామాల గిరిజనులు బయటకు రాకుండా వాగుల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారు.
ఉట్నూర్ తహసిల్దార్ రఘునాథరావు నర్సాపూర్ జె తో పాటు పలు గ్రామాలను సందర్శించి వర్షాకాలంలో పొంగుతున్న వాగులు దాటి బయటకు రావద్దని సూచనలు చేయడంతో పాటు వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు బయట ప్రపంచానికి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఎస్సై సాయన్న సైతం తన సిబ్బందితో గ్రామాలకు వెళ్లి వర్షాకాలంలో వాగులు దాటి బయటకు రావద్దని సూచనలు చేశారు.






