ఉప్పొంగిన కనకాయి జలపాతం
30-07-2026 03:27 PM
వాగులన్నీ కడెం వైపే
ఉప్పొంగి ప్రవహిస్తున్న కడెం నది
ఉరకలు వేస్తున్న పోచ్చేర, కనకాయి, జలపాతాలు
బోథ్,(విజయక్రాంతి): బజార్హత్నూర్, బోత్, సోనాల మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. బోత్ మండలంలోని పోచెర, జలపాతం బజార్హత్నూర్ మండలంలోని కనకాయి జలపాతం ఉగ్రరూపం దాల్చాయి. భారీ నీటి ప్రవాహంతో పాటు భీకరమైన శబ్దాలతో జలపాతం మీదుగా నీరు ఉరకలు వేస్తుంటే మంచు దుప్పటి కప్పుకున్నట్టు నీటి ప్రవాహం కనిపిస్తున్నది. జలపాతాల అందాలను చూసేందుకు పర్యటకులు ఉత్సాహంగా వెళుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు సన్నటి నీటి దారులతో కనిపించిన జలపాతాలు గురువారం భారీ నీటి ప్రవాహంతో కనిపిస్తున్నాయి.






