20 April, 2026 | 2:05 AM

గుండోజీ కుంట చెరువు మాయం

20-04-2026 12:02 AM
  1. రోజురోజుకు ఆక్రమణల పాలు
  2. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ అధికారులు 
  3. కబ్జా చెరలో గుండోజి కుంట
  4. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మాయమవుతున్న కుంట ఆనవాళ్లు

బిచ్కుంద, ఏప్రిల్ 19 (విజయక్రాంతి); కబ్జాదారుల కన్ను పడడంతో చెరువులు, కుంటలు మటుమాయం అవుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదు. దీంతో కబ్జాదారులు ఆడింది ఆట పాడింది పాటగా అక్రమణలకు పాల్పడుతున్నారు. పలువురు ఆక్రమణలకు పాల్పడడంతో నామరూపాలు లేకుండా పోతున్న గుండోజి కుంట వైనం ఇది.

వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు ఆనుకొని ఉన్న ఒకప్పటి అతి ముఖ్యతమైన గుండోజీ కుంట చెరువు నేడు పూర్తిగా నామరూపాలు లేకుండా మాయమైపోయి కనుమరుగై పోయింది. అక్రమణలను అడ్డుకోవలసిన ఇరిగేషన్ అధికారుల నిర్లక్షపు వలన విధినిర్వహణ తీరుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కుంట చెరువు భూమి కాకులెత్తుకుపోయిన చందంగా ఎవరికి పడితే వారు కజ్జాల కు పాల్పడి కుంట నామరూపాలు లేకుండా చేశారు. ఆకుంట స్థలంలోనే బిచ్కుంద  బస్టాండ్ ను నిర్మించారు.

బస్టాండ్ నిర్దేశిత స్థల సరిహద్దు లు సైతం సదరుకుంట చెరువు మద్యలోకి రావడం మూలంగా అసలు చెరువు ఎంత మేర ఎకరాల్లో ఉండేదో చెరువు నిర్దేశిత జాడ లేకుండా పోయింది. అసలు గవర్నమెంట్ స్థలాలు గంగ పాలైనా నెలవారీ లక్షలాది రూపాయల జీతభత్యాలు పొందుతున్న అధికార్లు చెరువులు కుంటలు కబ్జాలకు గురై మాయమైపోతున్న మొద్దునిద్ర  వీడకపోవడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏండ్ల చరిత్ర కబ్జాలపాలు 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద నడిబొడ్డున ఉన్న గుండోజి కుంట చెరువు కు ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఈ చెరువు కుంటతో వేల ఎకరాలు పంటలు పండాయి. బిచ్కుంద పట్టణంగా మారడంతో జనావాసాలు పెరగడంతో కుంట చెరువు అనావాళ్లు కానరాకుండా పోయాయి. కజ్జాదారులను అరికట్టాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎంతోమంది తమ జీవనోపాధి కోసం దుకాణాలు ఏర్పాటు చేసుకొని కబ్జా చేసి జీవిస్తున్నారు. మామూళ్ల మత్తుకు అలవాటుపడ్డ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

దీంతో బిచ్కుంద నడిబొడ్డున ఉన్న గుండోజి కుంట చెరువు స్థలం ఆనుకుని ఆర్టీసీ బస్టాండ్ లో నిర్మించారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉన్న పక్కన ఉన్న కుంటస్థలమంతా కబ్జాదారుల పాలైంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో ధరలు పెరిగాయి కానీ, కబ్జా స్థలాలపై అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంతో చరిత్ర కలిగిన గుండోజి కుంట చెరువు ఆనవాళ్లు లేకుండా కబ్జాల పాలు అయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హద్దులు ఏర్పాటు చేసి గుండోజికుంట ఆ నవాళ్ళను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.