29 August, 2026 | 10:57 PM

అన్నదాత నుంచి విద్యుత్ ప్రదాతగా రైతులు

29-08-2026 10:02 PM

దమ్మన్నపేటలో 2 మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంట్ టెస్ట్ రన్

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంట్‌ను నాగంపేట 33/11 కేవీ సబ్స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేసి టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీఎం-కుసుమ్ పథకం ద్వారా రైతులు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారుతున్నారని, హరిత ఇంధన ఉత్పత్తిలో భాగస్వామ్యం కావడం శుభపరిణామమని తెలిపారు. జిల్లాలో 17 దరఖాస్తుదారుల్లో ఇప్పటివరకు 5 ప్రాజెక్టులు (10 మెగావాట్లు) గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయని చెప్పారు.

రెడ్కో జిల్లా మేనేజర్ మనోహర్ వివరాల ప్రకారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 95 మంది రైతులు 125.9 మెగావాట్ల సామర్థ్యంతో పీపీఏ ఒప్పందాలు చేసుకోగా, ఒక్క యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక మెగావాట్ ప్లాంట్‌కు సుమారు 3.5 ఎకరాల భూమి అవసరమై, ఏటా సుమారు రూ.56 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.