ఆధునిక సాంకేతికతతో రైతుల ఆదాయం పెంచాలి
29-08-2026 09:47 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించి రైతుల ఆదాయం పెంచాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం బిజినపల్లి మండలం పాలెంలోని కేవీకేను సందర్శించారు. కేవీకే రైతులకు సాంకేతిక వారధిగా నిలిచి, క్షేత్రస్థాయిలో వారి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందించాలని సూచించారు.
పంటల వైవిధ్యీకరణ, నాణ్యమైన విత్తనాలు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించి, పురుగుమందుల పిచికారీలో డ్రోన్లను సురక్షితంగా వినియోగించేలా రైతులకు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డా. ఓ. శైల, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.






