1 June, 2026 | 4:16 AM

టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి

01-06-2026 02:37 AM
  1. బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపణ
  2. అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో ఐదుగురు అరెస్ట్
  3. పశ్చిమ బెంగాల్ చందితల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత 

కోల్‌కతా, మే 31: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. చందితల పోలీస్ స్టేషన్ బయట దాడి ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్టు చేసిన టీఎంసీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమందితో కలిసి చందితల పోలీస్ స్టేషన్‌కు కల్యాణ్ బెనర్జీ వెళ్లారు. పోలీసులకు మెమోరాండమ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు, నినాదాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. కల్యాణ్ బెనర్జీ తలకు స్వల్ప గాయం అయింది.

గొడవ పెరుగుతుండడంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి ఇరువర్గాలను అదుపు చేశారు. కాగా ఈ దాడి ఘటనపై ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేశారని, రాజ్యా ంగ హక్కులను బీజేపీ కాలరాస్తుందని మండిపడ్డారు. దాడికి నిరసనగా తలపై తెల్లగుడ్డను కప్పుకొని అక్కడే నిరసనకు దిగారు. ఈ దాడి అబద్ధమని కల్యాణ్ బెనర్జీ నాటకం ఆడుతున్నారని బీజేపీ ఆరోపించింది. అభిషేక్ బెనర్జీ గుడ్డు వివాదం నుంచి ప్రజల దృష్టి  మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి ఘటనను టీఎంసీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, పరిస్థితులు చేయి దాటిపోయాయని ఆరోపించాయి. .

భౌతిక దాడులపై మమత గరం.. ఆసుపత్రి సీఈవోకు వార్నింగ్..

కాగా శనివారం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో ఒకరు మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం అభిషేక్ బెనర్జీ వెళ్లారు. ఈ సమయంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను అడ్డుకొని భౌతికంగా రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసుల సహాయంతో బెనర్జీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగారు.

ఈదాడిని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దాడులు ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్నారని ఇందుకు బీజేపీ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా అభిషేక్ బెనర్జీ చికిత్స పొందిన బెల్ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్‌ను మమత బెదిరించారన్న ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో ‘టాండన్ మీరు తప్పుచేశారు’ మమత వార్నింగ్ ఇచ్చారు.