19 July, 2026 | 3:52 AM

బండి.. ఈటల మధ్య సయోధ్యకు వేళాయె!

19-07-2026 01:03 AM

పార్టీలో అంతర్గత విభేదాలపై అధిష్ఠానం దృష్టి 

రంగంలోకి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్  ఎంపీ లక్ష్మణ్ నివాసంలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ

తెలంగాణలో అధికారమే టార్గెట్.. కలిసి పనిచేయాలని సూచన

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభే దాలకు చెక్ పెట్టేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. తెలంగాణలో అధికార లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. కీలక నేతల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా శనివారం ఎంపీ లక్ష్మణ్ నివాసంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కొంతకాలం గా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య సఖ్యత లోపించిన విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు పరోక్షంగా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ ఇరువురు నేతల మధ్య ఉన్న గ్యాప్ బాగా పెరిగిపోయింది. పలు సందర్భాల్లో పరస్పర వ్యతిరేక పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఈ అంతర్గత విభేదాలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ ప్రభావం పార్టీ బలోపేతంపై పడుతుండటంతో ఢిల్లీ పెద్దలకు అందిన రిపోర్ట్ ఆధారంగా చికిత్స ప్రారంభించారు.

బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ ఒకే జిల్లా నుంచి ఉన్న కీలక నేతలు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ కవర్గ సమస్యే వీరి మధ్య వివాదానికి దారితీసినట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గంలో ఇంకొకరు కాలుమోపొద్దని గతంలో విమర్శలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. హుజూరాబాద్ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని బండి సంజయ్ వాదనగా తెలుస్తోంది.

గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అనుచరులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చుకోని పరిస్థితి ఉందని, నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదని తన సన్నిహితుల వద్ద ఈటల రాజేందర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే వీరిద్దరి మధ్య కొంత కాలంగా దూరం పెంచినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టిన అధిష్ఠానం..

కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో ఇద్దరూ కలి సి పనిచేయాలని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని అభయ్ పాటిల్ ఆదేశించినట్లుగా సమాచారం. అంతర్గత విభేదా లు, ఇగోలు పక్కనపెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కలిసి పనిచేయాలని ఇరు వురు నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే శుక్రవారం ఈటల రాజేందర్‌తో భేటీ అయిన అభయ్ పాటిల్..  శనివా రం లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలతో లంచ్ మీటింగ్ నిర్వహించారు.

కలిసి పనిచేస్తాం: ఎంపీ లక్ష్మణ్

భేటీ అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో కలిసి ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘మా ఇంటికి బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను భోజనానికి పిలిచాను. రాష్ట్ర రాజకీయాలపై చర్చించాం. ఇటీవల ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది.

అధికారం చేపట్టడమే లక్ష్యంగా మేము కలిసికట్టుగా పనిచేస్తాం. సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు, జమిలి ఎన్నికలు రావడం ఖాయం. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. కాంగ్రెస్ హాయాంలో హైదరాబాద్‌లో రియల్‌ఎ స్టేట్ కుప్పకూలింది’ అని పేర్కొన్నారు.