27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల నకిలీ ఖాతాల తొలగింపు

26-03-2026 01:23 AM
  1. పేద మధ్యతరగతికి సులభమైన సేవలందిస్తాం

75వేల ప్రత్యేక రైళ్లను నడిపాం

90 శాతం రైలు ప్రమాదాలు తగ్గాయి

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూ ఢిల్లీ, మార్చి 25: ఐఆర్‌సీటీసీ పోర్టల్ లో 3 కోట్లకు పైగా నకిలీ ఖాతాలున్నాయని, వాటిని తొలగించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో 78 శాతం సీట్లు నాన్ ఏసీ కేటగిరీలోనే ఉన్నాయన్నారు. రైల్వే అనేది పేద, మధ్యతరగతి ప్రజల రవాణా సాధనమని, వారికి సులభమైన, సరసమైన రవాణా సేవలను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు.

బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 75,000 ప్రత్యేక రైళ్లును దేశవ్యాప్తంగా నడిపినట్లు చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సరసమైన సర్వీసులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళారులు రైలు టికెట్లను అమ్మకుండా నిరోధించామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని కలిగించేందుకు కొత్త నిర్ణయాలను తీసుకున్నామన్నారు. రైలు బయల్దేరనున్న 72 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే  క్యాన్సెలేషన్ రుసుము మాత్రమే కోత విధిస్తామన్నారు. మిగతా మొత్తం రిఫండ్ అందిస్తామన్నారు. దీన్నే మ్యాగ్జిమమ్ రిఫండ్ గా ఆయన పేర్కొన్నారు. రైలు బయల్దేరడానికి 30 నిమిషాల ముందు వరకు స్టేషన్ మార్చుకునే వెసులుబాటును కల్పించామని చెప్పారు.

కోవిడ్ అనంతర కాలం లో దేశవ్యాప్తంగా సుమారు 1,024 కొత్త రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. ఇప్పటికే ఉన్న రైళ్లకు 4,651 కొత్త కోచ్ లను జోడించామని తెలిపారు. భద్రతపై పటిష్ట చర్యలు చేపట్టడంతో 90 శాతం ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ఇందుకోసం లక్షా 20వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.