ఆ రెండూ ఒక్కటే
ఫాంహౌస్‌లో కాల్పుల ఘటనపై బీజేపీ పెదవి విప్పలేదేం?
- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయ్
- అల్లుడు, కుమారుడి చేతిలో కేసీఆర్ గృహ నిర్బంధం
- నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విద్యావిధానం
- విద్యాకమిషన్ నివేదికే ఫైనల్ కాదు
- ఫోన్ ట్యాపింగ్‌లో చట్ట ప్రకారమే ముందుకు..
- మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తెస్తున్నామని, వాటిపై కమిటీ అధ్యయనం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులపై కమిషన్ నివేదికే ఫైనల్ కాద ని, జాతీయస్థాయి అధ్యయనం తర్వాత విద్యావ్యవస్థలో మార్పులుంటాయని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యావిధానంలో మార్పులుంటాయని చెప్పారు.
ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ 2 వరకు ఒకేచోట చదివేలా విద్యావిధానం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తు కే మైలురాయి వంటిదని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్లో పెద్దపీట వేశామని, అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామని సీఎం తెలిపారు. జూన్ నుంచి ప్రతి కుటుంబానికి ఇందిర కుటుంబ జీవిత బీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం ఇస్తామన్నారు.
విద్యారంగ సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అధిక నిధులు కేటాయించామన్నారు. అల్లుడు, కుమారుడు కలిసి కేసీ ఆర్‌ను గృహనిర్బంధం చేశారని, అందువల్లే ఆయన అసెంబ్లీకి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కమిటీ హాల్లో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
ఈ మధ్య ఒక ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకున్నవారు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినా, బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బీజేపీ నేతలు మాట్లాడట్లేదని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
వెనుకాడేదే లేదు..
మూసీ పునరుజ్జీవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. బాధితులను మాత్రం ఆదుకుంటామని తెలిపారు. మూసీ అభివృద్ధికి అప్పులు ఇచ్చేందుకు ఏడీబీ సిద్ధంగా ఉందని తెలిపారు. డీపీఆర్ సాంకేతిక నిపుణుల ద్వారానే తయారవుతోందని పేర్కొన్నారు. మూసీ డీపీఆర్ పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామన్నారు.
భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాకపోతే నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాలేదు కానీ గత ప్రభుత్వం రూ. 44 వేల కోట్ల అప్పు చెల్లించినట్లు చెప్పారు. ఆర్థిక వెసులుబాటు చూసుకొని గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. హరీశ్, కేటీఆర్, కేసీఆర్‌కు ఏమి చెప్పినా చెవుటోడి ముందు శంఖం ఊదినట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధం..
హిల్ట్ పాలసీ, టీడీఆర్ భూబదలాయింపుపై సవాలు విసిరానన్న సీఎం ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీశ్‌కు సవాల్ చేసినట్లు గుర్తుచేశారు. హిల్ట్ పాలసీ వల్ల రూ.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ. 3.47 లక్షల కోట్లు అప్పులు చేశామని సీఎం వెల్లడించారు. అందులో నుంచి రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకే చెల్లించామన్నారు.
తాము తెచ్చిన అప్పుల్లో కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే వాడుకున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లుతున్నామని, అప్పుడే కోర్టులో కేసు నిలుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కోర్టు కొట్టేసినట్లు కొందరు దుష్ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పోన్ ట్యాపింగ్ కేసు ఆలస్యం కావడానికి.. ప్రభాకర్‌రావు 20 నెలలు అందుబాటులో లేకపోవడమేనన్నారు.
ప్రభాకకర్‌రావు అందుబాటులోకి వచ్చాక విచారణ వేగంగా కొనసాగుతోందని, సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణకే రాలేదని సీఎం స్పష్టం చేశారు. హరీష్‌రావుపై చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి వేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లు ప్రచారం చేశారని సీఎం మండిపడ్డారు. జీఎస్టీ వసూళ్లు గడిచిన రెండు నెలల్లో రూ.4 వేల కోట్లు దాటాయన్నారు.
ఎవరు ఏ పదవైనా అడగొచ్చు..
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా, ఏ పదవి అయినా చేపట్టే వెసులుబాటు, స్వేచ్ఛ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదవీ ఆశించిన వారికి అభ్యంతరం చెప్పడం కానీ, అడ్డుకోవడం కాని జరగదని అన్నారు. ఆపరేషన్ కగార్ అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయమని, మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలని, భద్రత కల్పిస్తామని మాత్రమే విజ్ఞప్తి చేశానన్నారు.
మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటుపై ఆయన మనవువడు వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీడియా గుర్తుచేయగా, గాంధీ జాతిపిత అని, ఆయన మనవడికి ఒక్కడికే కాదన్నారు. ఆయనకు బీఆర్‌ఎస్ తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్‌ను ప్రకటిస్తారా..? అని మీడియా ప్రశ్నించగా తెలంగాణ సమాజంలో చర్చ జరగాలన్నారు.




