30 June, 2026 | 2:19 AM

20 వేల పోస్టులు భర్తీ చేయాలి

30-06-2026 01:27 AM

ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేయాలి

డిమాండ్‌ను పరిష్కరించకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ముట్టడిలో నిరుద్యోగ జేఏసీ

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): 5 వేల పోస్టులతో కాకుండా 20 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం లక్డీకపూల్‌లోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయ (డీజీపీ ఆఫీస్) ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ యత్నించింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, వీరికి అన్యాయం చేయొద్దని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

దీనిపై ప్రభత్వం స్పష్టత ఇవ్వాలని, తమ డిమాండ్‌ను జూలై 2లోపు పరిష్కరించ కుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడి చేపడతామని వారు హెచ్చరించారు. ఈ ముట్టడి పిలుపు నేపథ్యంలో డీజీపీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ముట్టడికి యత్నించిన జేఏసీ నాయకులు కయ్య వెంకటేష్, కిరణ్, రాథోడ్, రమ్య, అష్మను ఈడ్చుకుంటూ లాక్కెళ్లారని, నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వారు తెలిపారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అరెస్టున వారిని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్ నాయక్, జనరల్ సెక్రటరీ ఆర్‌కే వన్నార్ చోళ స్టేషన్‌లో కలిసి, వారికి సంఘీభావం తెలిపారు.