24 February, 2026 | 4:35 PM

పసిపాప మృతి కారకులను శిక్షించాలి

24-02-2026 01:21 AM

బీసీ, ఎస్సి, ఎస్టి, జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కొవ్వొత్తుల ర్యాలీ

కోనరావుపేట ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మృతి ఘటన కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ, ఎస్సి, ఎస్టి, జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై అగ్ర కులానికి చెందిన ద్రోహులు దాడి చేయడంతో రెండు నెలల పసికందు మృతి చెందిందని వారు ఆరోపించారు.

ఈ ఘటన ను నిరసిస్తూ సోమవారం కోనరావుపేటలో చాకలి ఐలమ్మ నుంచి బస్టాండ్ లోని అంబేద్కర్ కూడలి వరకు బీసీ, ఎస్సి, ఎస్టి, జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు.పసిపాప మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబం మల్లన్న దేవుని దర్శనానికి వెళుతుండగా కొంతమంది అగ్రకులానికి చెందిన వారు అడ్డుకుని, రెండు నెలల పసికందు ఉందన్న విషయం కూడా పట్టించుకోకుండా దాడి చేశారని అన్నారు.

ఆ దాడి కారణంగానే పాప మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై కఠిన శిక్షలు విధించాలని, అలాగే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని బీసీ, ఎస్సి, ఎస్టి, జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటనపై న్యాయం జరగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంగం గ్రామ అధ్యక్షులు జింక కరుణాకర్, వార్డ్ సభ్యులు జింక వెంకటి, మండల అధ్యక్షులు చెక్కపెళ్లి చంద్రయ్య, అమర్, గోవర్ధన్ ,అనిల్, మనోజ్, దాసు.బిసి సంఘం నాయకులు పొన్నం పర్శరాం, రాజు, కనుకయ్య, తిరుపతి, యువకులు, రజకసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.