30 June, 2026 | 7:27 PM

మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

30-06-2026 06:20 PM

మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

మంథని,(విజయక్రాంతి): దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేసి యువతను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థినీ, విద్యార్థులు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పిలుపునిచ్చారు. మంగళవారం మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో మంథనిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మాదక ద్రవ్యాల బారిన పడితే విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. అలాంటి ప్రలోభాలకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ, మంచి విలువలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఎల్.ఎన్. హరిబాబు, ఉపాధ్యక్షుడు కె. రఘోతం రెడ్డి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.