30 June, 2026 | 7:25 PM

సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

30-06-2026 06:28 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయ క్రాంతి): సిద్దాపూర్ రిజర్వాయర్ భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు.హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని కార్యాలయంలో మంగళవారం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీ జనరల్ రమేష్, అడ్మిన్ శ్రీనివాస్ లతో పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేస్తూ జి.ఓ. నం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.