19 June, 2026 | 2:49 AM

ఉపయోగంలోకి వచ్చిన ఈ టెండర్ హాల్

19-06-2026 12:18 AM

కేసముద్రం, జూన్ 18 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ టెండర్ హాల్ ను గురువారం తిరిగి ఓపెన్ చేశారు. జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం ( ఈ నామ్) ద్వారా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ఆన్లైన్ టెండర్ ద్వారా రైతులు విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది.

ఇందుకోసం వ్యాపారులకు ప్రత్యేకంగా రహస్యంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు ఖరారు చేయడానికి కంప్యూటర్లతో ప్రత్యేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేసి ఈ టెండర్ హాల్ వారికి కేటాయించారు. అయితే ఇటీవల కేసముద్రం మార్కెట్లో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్ల సమయంలో ఈ టెండర్ హాల్ ను టోకెన్ల జారీ కోసం ఇచ్చారు. మక్కల కొనుగోళ్ల తర్వాత యధావిధిగా వ్యాపారులకు ఈ టెండర్ హాల్ తిరిగి కేటాయించకపోవడంతో వ్యాపారులు తఖ్ పట్టి కేంద్రంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనితో రహస్యంగా టెండర్లు ఖరారు చేసే పరిస్థితి లేకపోవడం, ఇతర సమస్యలపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఈనెల 13న ‘అలంకారప్రాయంగా ఈ టెండర్ హాల్ ’ పేరుతో ప్రత్యేక వార్తా కథనం ప్రచురించడం జరిగింది. ఈ వార్త కథనానికి స్పందించిన మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గురువారం ఈ టెండర్ హాల్ ను తిరిగి వ్యాపారులకు కేటాయించారు. వ్యాపారులు ఏకకాలంలో టెండర్లు ఖరారు చేసుకోవడానికి అనువుగా మారింది.