ఉధృతంగా పెరుగుతున్న వరద గోదావరి
శనివారం మధ్యాహ్నం నాటికి మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు దాటనున్న గోదావరి
అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భద్రాచలం కరకట్ట ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్ పోలీస్ సూపర్డెంట్ రోహిత్ రాజ్
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గల ప్రాంతాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా వాగులు వంకలు ఉపనదులు పొంగి పడటంతో గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతూ శుక్రవారం సాయంత్రానికి 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం విధితమే. అధికారికంగా లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 49. 50 అడుగులకు చేరుకున్న గోదావరి అదేవిధంగా పెరుగుతూ శనివారం మధ్యాహ్నానికి 53 అడుగులకు చేరుకుంటుందని, మూడవ ప్రమాద హెచ్చరికకు చేరుతుందని lఅంచనా వేసి అందుకు అనుగుణంగా వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా పోలీస్ ఎస్పీ రోహిత్ రాజులు భద్రాచలంలోని కరకట్ట ప్రాంతంలో పర్యటించి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరి బ్యాక్ వాటర్ లోనికి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన చర్యలు గురించి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా పడటంతో చర్ల మండలంలోని వీరాపురం ఇసుక ర్యాంపులు ప్రోక్లైన్ డ్రైవర్లు, సిబ్బంది, ఇసుక కోసం వెళ్లిన లారీలు చిక్కుకోవడంతో అధికారుల అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం వద్ద 49 అడుగులకు చేరుకోగానే స్నాన ఘట్టాలు అన్ని వరద నీటిలో మునిగిపోయాయి. అంతేకాకుండా గోదావరి బ్యాక్ వాటర్ భద్రాద్రి రామయ్య అన్న సత్రం వద్దకు చేరుకొని రోడ్డు సైతం ముంచెత్తింది. భద్రాచలంలోని రెవెన్యూ పంచాయతీ అధికారులు ముంపు ప్రాంతాలైన కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ ముదిరాజ్ వీధి ఆదర్శనగర్ కాలనీ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే వరద సాయ కార్యక్రమాలలో పాల్గొనటానికి నాటు పడవలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అలాగే ముంపు మండలాలలో ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాలలో బఫర్ స్టాక్స్ సిద్ధంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.






