ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్నారు
- చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
- కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపాటు
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా 50 వేల ఎకరాల భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ అని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీష్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద మండావత్ రాంబల్ నాయక్ అధ్యక్షతన గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని కోరుతూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీలకు బేడీలు వేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.
చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయకపోతే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలను కార్పొరేషన్ల పేరిట మోసం చేయడం తప్ప వారి సంక్షేమం కోసం ఒక రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరాపార్క్ నుంచి మొదలైన ఈ పోరాటం ప్రతితండాకు చేరాలని, చేవెళ్ల డిక్లరేషన్ అమలయ్యేంత వరకు పోరాడాలని సూచించారు. తులం బంగారం హామీ ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. పుట్టిన బిడ్డకు రూ. 13వేలు ఇవ్వడం లేదని, పది, ఇంటర్, పీజీ పాసైతే డబ్బులు ఇస్తామన్నారని ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డికే కాంట్రాక్టులు వస్తాయని విమర్శించారు.
ఇప్పటికైనా ఖర్గే చొరవ చూపకుంటే నాలుగు రైళ్లలో ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పోడుభూములకు పట్టాలు ఇచ్చిందే బీఆర్‌ఎస్ అన్నారు. కాంగ్రెస్ వచ్చాక పట్టాలు ఇవ్వకుండా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మండావత్ రాంబల్ నాయక్, ప్రధాన కార్యదర్శి కోట్యానాయక్ భూక్యా, చందర్ నాయక్, భరత్ చౌహాన్, అశోక్ నాయక్, ధరావత్ బిక్షం నాయక్, హరినాయక్, రాణా ప్రతాప్ నాయక్, అధిక సంఖ్యలో లంబాడి సంఘాల నాయకులు పాల్గొన్నారు.






