పోస్టు ఇచ్చారు.. మళ్లీ తొలగించారు..!
- కలెక్టర్‌కు విన్నవించినా.. ఫలితం శూన్యం ..
- న్యాయం చేయాలని బాధిత మహిళా ఆవేదన
ఆదిలాబాద్, జూన్ 29 (విజయక్రాంతి) : ఇటీవల జిల్లాలో ప్రైమరీ స్కూల్ లలో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించగా .. అందులో తనను ఇన్స్ట్రక్టర్ గా ఎంపిక చేసి.. ఇప్పుడు మళ్లీ తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పడం శోచనీయమని బాధిత మహిళా ప్రతిభ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను సోమవారం ప్రజావాణి లో బాధిత మహిళ కలిసి ఫిర్యాదు చేయగా.. స్వయంగా కలెక్టర్ ఏమీ చేయలేమని మీ ఉద్యోగం వదులుకోవాలని చెప్పడం బాధాకరమని బాధిత మహిళా ప్రతిభ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు.
బంగారు గూడ ఎంపీపీఎస్ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ గా ఈనెల 12న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తనను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన తుది జాబితాను 17వ తేదీన విడుదల చేయగా.. దాని ఆధారంగా పాఠశాలలో పూర్వ విద్యార్థుల నుండి ప్రవేశాలు స్వీకరించి 10 రోజుల పాటు విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఉన్నపళంగా తనను తొలగించి..ఇంకో అభ్యర్థికి పోస్టు కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థి గడువు లోపు సమర్పించాల్సి పత్రాలు సమర్పించలేదన్నారు. ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక సదరు అభ్యర్థి ధ్రువపత్రాలు కలెక్టర్ కు ఇవ్వగా.. జిల్లా కలెక్టర్ ఆమెను పరిగణలోకి తీసుకొని నన్ను తొలగించడం సమంజసం కాదని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






