30 June, 2026 | 2:19 AM

ఆర్టీసీ యూనియన్ ఎన్నికలకు కసరత్తు

30-06-2026 01:29 AM
  1. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యాజమాన్యం చర్యలు
  2. మూడు రోజుల్లో ఫస్ట్ నోటీస్

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్పినట్లుగానే యూనియన్ ఎన్నికలకు టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు షురూ చేసింది. రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు వెలువడనున్నది. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలను తెరదించుతూ యాజమాన్యం ఎన్ని కల ప్రక్రియను వేగం చేసింది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందు కు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణ అధికారి అయిన జా యింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ భేటీ నేప థ్యంలో యూనియన్ వేరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ బూత్ వివరాలు, బూత్ ఇన్‌ఛార్జ్ జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి అందజేసింది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రెండు, మూడు రోజుల్లో ‘ఫస్ట్ నోటీస్’ ఇచ్చేందుకు ఎన్నికల నిర్వహణ అధికారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియంతా ఎక్కడా ఎలాంటి ఆటంకాలూ లేకుండా, పారదర్శకంగా ముగిసేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.