25 February, 2026 | 2:47 AM

హెల్త్ కార్డులిచ్చారు.. థ్యాంక్యూ!

25-02-2026 12:47 AM

సీఎం గారూ.. ఇంకా సమస్యలు అనేకం

  1. వచ్చే బడ్జెట్‌లో పీఆర్సీ ప్రకటన సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులను పరిష్కరించండి
  2. తండ్రిలాంటి ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకుంటాం
  3. మావి గొంతెమ్మ కోర్కెలు కావు
  4. తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): పదేళ్ల నుంచి హెల్త్ కార్డుల కోసం ఎదురు చూశామని, నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయడంతోపాటు క్యాబినెట్ సమావేశంలో పలు సానుకూల నిర్ణయాలను తీసుకోవడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భం గా సీఎం రేవంత్‌రెడ్డికి, క్యాబినెట్‌కు జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయ కులు ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, బీ శ్యామ్, సదానందంగౌడ్, పుల్గం దామోదర్‌రెడ్డి, చావ రవి, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు కే లక్ష్మయ్య, కస్తూరి వెంకట్, భిక్షం గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులతో కలిసి ఉద్యోగుల జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడారు.

తమ 64 సమస్యల్లో ఇప్పటి వరకు 27 సమస్యలు పరిష్కారమయ్యాయని, ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోం దన్నారు. అలాగే పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సమస్యలను సై తం పరిష్కరించాలని కోరారు. తాము శాంతియుతంగా ప్రభుత్వంతో మాట్లాడి తమ హక్కులను సాధించుకుంటామని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ తమకు తెలు సునని అన్నారు.

ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యమైనప్పటికీ ఆరోగ్యం, బీమా అంశంలో ప్రభుత్వం చారిత్రక నిర్ణ యం తీసుకున్నదని, వచ్చే బడ్జెట్‌లో పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరా రు. రాష్ట్ర ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను, 60 సంవత్సరాల లోపు సహజ మరణం చెందితే రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, దీనిపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.

ప్రమాద బీమా అనేది వ్యక్తి చనిపోతేనే ఇస్తారని, ఆ డబ్బులు మృతుని కుటుంబ సభ్యులకు ఎంతో ఆసరగా ఉం టుందన్నారు. ఉద్యోగ సమస్యల అంశంలో గత ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడ్డామని, ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్క రిస్తోందన్నారు. మిగిలిన సమస్యలను, డిమాండ్లను కూడా సాధిస్తామని తెలిపారు. కుటుంబంలోని తండ్రితో ఎలా కొట్లాడుతా మో అదే తరహాలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు. 

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్

ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ మాట్లాడుతూ...తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, సీపీఎస్ ఉద్యోగల సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. నగదు రహిత వైద్యసే వలను అందించేందుకు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు. ఉద్యోగు ల సమస్యలను పరిష్కరిస్తే తాము ప్రభుత్వానికి మరింత సహకరిస్తామని, సంక్షేమ పథ కాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 

వచ్చే బడ్జెట్‌లో పీఆర్సీని ప్రకటించాలి : పుల్గం దామోదర్‌రెడ్డి

పుల్గం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... వచ్చే బడ్జెట్‌లో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిటీ వేసి రెండున్నరేళ్లవుతోంద న్నారు. ఎన్నో ఏండ్ల నుంచి హెల్త్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. పెండింగ్ బకాయిల కోసం ప్రభు త్వం విడుదల చేస్తున్న రూ.700 కోట్లు కాకుండా రూ.1500 కోట్లు విడుదల చేయాలని కోరారు. 

మిగతా ఉపాధ్యాయులకూ అమలు చేయాలి: సదానందంగౌడ్

సదానందంగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఈహెచ్‌ఎస్ స్కీమ్‌లో ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో పనిచేసే 75 వేల మంది ఉపాధ్యా యులకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, పెన్షనర్ల బకాయిలకు ఒకే మొత్తంలో రూ.800 కోట్లను విడుదల చేయాలన్నారు. 

వెయ్యే.. కట్ చేయాలి : చావ రవి

చావ రవి మాట్లాడుతూ...ఉద్యోగలు జీతాల నుంచి 1.5 శాతం కాకుండా నగదు రహిత స్కీం కోసం వెయ్యి రూపాయాలు మాత్రమే కట్ చేయాలన్నారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ట్రస్ట్‌లో జమచెయ్యాలని కోరారు. పీఆర్సీని 1.7.2023 నుం చి అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ఆరో గ్య కార్డులు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

66 మంది చనిపోయారు : కే లక్ష్మయ్య

కే లక్ష్మయ్య మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 66 మంది వరకు పెన్షనర్లు తమ బెనిఫిట్స్ పొందకుండానే చనిపో వడం బాధాకరమన్నారు. హెల్త్‌స్కీమ్‌కు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పేర్లు వచ్చే విధంగా ఈపీహెచ్ పేరు పెట్టాలని కోరారు. 

ఈహెచ్‌ఎస్‌తో క్యాష్‌లెస్ వైద్యసేవలు: బీ శ్యామ్

బీ శ్యామ్ మాట్లాడుతూ...ఈహెచ్‌ఎస్ స్కీమ్‌తో క్యాష్‌లెస్ వైద్యసేవలు ఉద్యోగులకు అందనున్నాయని, చలా మంచి స్కీమని అన్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే కూడా తక్కువ ప్రీమియంతో నగదు రహిత వైద్యాన్ని ప్రభుత్వం అందించనుందని తెలిపారు. కుటుంబంలోని ఉద్యో గుని భార్య, పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా ఈ స్కీం అమలు కానుంద న్నారు. పెండింగ్‌లోని నాలుగు డీఏలను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్స రంలోనైనా ప్రభుత్వం విడుదల చేసే పెం డింగ్ బిల్లుల మొత్తాన్ని రూ.1500 కోట్లకు పెంచాలని సీఎంను కోరారు.

ఈ రెండు చరిత్రలో నిలిచిపోతాయి : మంచాల రవీందర్

మంచాల రవీందర్ మాట్లాడుతూ.. .ప్రమాద బీమా, ఈహెచ్‌ఎస్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ప్రకటించడమనేది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 652 గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలకు అవకాశాలు కల్పిచడం గొప్ప విషయమన్నారు.

మా చిరకాల వాంఛ తీర్చారు

సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యోగ,పెన్షనర్ సంఘాల నేతల కృతజ్ఞతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి నేతత్వంలోని క్యాబినెట్.. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని కొనియాడారు. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పీ దామోదర్‌రెడ్డి (పీఆర్‌టీయూ), చావా రవి (యూటీఎఫ్), కే వెంకటేశ్వర్లు(టీఎన్జీవో), ఉపేందర్‌రెడ్డి(టీజీవో), జీ సదానందగౌడ్(ఎస్టీయూ), దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ), ఉమాదేవి(పెన్షనర్స్), వీ రవీందర్ రెడ్డి (రెవెన్యూ), గిరి శ్రీనివాస్‌రెడ్డి (సెక్రటేరియట్), ఖాదర్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్), టీ లక్ష్మణ్(ఎక్సైజ్), తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, కే రామకృష్ణ(డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్ రాములు, రమేష్ పాక, సీహెచ్ శ్రీనివాస్ (తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వీ భిక్షం (తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డాక్టర్ నిర్మల, ఎల్ దశరథ్(టీజీసీపీఎస్‌ఈ యూ), గరికె ఉపేందర్‌రావు (జీపీవో), సుగంధిని (హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డబ్ల్యూ), భూమేశ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.