యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
పుట్టింట్లో ఉరి వేసుకున్న భార్య
భార్య మృతిని తట్టుకోలేని భర్త ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతుల విషాదాంతం
కొండపాక, మే 11: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న యువ దంపతులు నెల రోజులు గడవకముందే ఆత్మహత్యలకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. కుక్కునూరుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన దేశెట్టి వినయ్, కొండపాక మండలానికి చెందిన అంజలి కొంతకాలంగా ప్రేమించుకొని ఇటీవలే కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అంజలిని తన అమ్మగారి ఇంట్లో విడిచి వినయ్ ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లాడు. కాగా ఆదివారం అంజలి భర్త ఫోన్ చేయగా ఆలస్యంగా స్పందించడంతో భర్త మందలించాడు. మనస్తాపం చెందిన భార్య పుట్టింట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. ఆత్మహత్యకు ముందు భర్త వినయ్‌కు ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను” అని చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న వినయ్ ఆమెను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
భార్య మృతిని తట్టుకోలేకపోయిన వినయ్, హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో రాయారం గ్రామ శివారులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ తాను ఉరి వేసుకునే ముందు తండ్రికి లొకేషన్ పెట్టడంతో పాటు మిత్రులకు సమాచారం అందించాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నవదంపతుల మృతితో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.






