చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్ పర్యాటకులు మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా(Chamba) జిల్లాలోని కాకిరా వద్ద సోమవారం తెల్లవారుజామున తాము ప్రయాణిస్తున్న కారు లోతైన లోయలో పడిపోవడంతో గుజరాత్‌కు చెందిన ఆరుగురు పర్యాటకులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 10 మంది ప్రయాణికులతో పరిమితికి మించి నిండిన టయోటా ఇన్నోవా వాహనం, మనాలి నుండి డల్హౌసీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వాహనం పడిపోయిన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, వాహనాల భాగాలు నలువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని తరలించడానికి తాము, సహాయక బృందాలు చాలా ఇబ్బంది పడ్డాయని, వారిని జోనల్ ఆసుపత్రికి తరలించామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






