27 March, 2026 | 3:43 AM

ఇంధన కొరత లేదు.. ఆందోళన వద్దు

27-03-2026 02:00 AM

పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): రాష్ర్టంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయన ఆయన చెప్పారు. బుధవారం ఇంధన నిల్వలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కలతో సహా వివరించారు. రాష్ర్టంలో ఇంధన కొరత ఉందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు సరిపడా నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుం డా చూసేందుకు, ట్యాంకర్ల కదలికలను పర్యవేక్షించేందుకు ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేసి నట్లు వెల్లడించారు. సాధారణ రోజుల కన్నా ఏకంగా 44 శాతం అదనంగా పెట్రోల్, డీజిల్ ను బంకులకు సరఫరా  చేసినట్లు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 1,956 పెట్రోల్ ట్యాంక ర్లు, 1,117 డీజిల్ ట్యాంకర్లు బంకులకు చేరుకున్నాయని వివరించారు. ఇంధన సరఫరాను అడ్డుకున్నా, కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.