అదరగొడతారా?
* ఐపీఎల్ అంటే యువక్రికెటర్లకు గొప్ప వేదిక... ఇక్కడ సత్తా చాటితే జాతీయ జట్టులోకి ఎంపికవ్వొచ్చు. అందుకే దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లకు మంచి అవకాశం..అదే సమయంలో యువ క్రికెటర్ల టాలెంట్‌ను అందుకోవడంలోనూ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. మినీ వేలంలో అనామక ఆటగాళ్లపై కోట్లు కురుపించాయి. వారి దేశవాళీ ప్రతిభ ఆధారం ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్స్ పైనే అందరి చూపు ఉంది. మరి వేలంలో హిట్ అయిన ఆ ప్లేయర్స్ ఆటలో అదరగొడతారా?
- అనామక ప్లేయర్స్‌పైనే అందరి చూపు
- వేలంలో కోట్లు పలకడంతో ఆసక్తి
- క్కడ రాణిస్తే టీమిండియాకే
హైదరాబాద్, మార్చి 26 : దేశవాళీ క్రికె ట్ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఐపీఎల్ మొదలైంది. గత 18 సీజన్లుగా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్ ముంగిట కొందరు అనామక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. మినీవేలంలో కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసిం ది. అలా కోట్లు కొల్లగొట్టిన అన్ క్యాప్డ్ ప్లే యర్స్‌లో నలుగురు ఈ సీజన్‌లో ఎలా ఆడతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
జమ్మూ ఎక్స్ ప్రెస్
వీరిలో ముందు గా చెప్పుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ పేస్ ఎక్స్ ప్రెస్ ఆకీబ్ నబీదార్.. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సంచలన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా అతని సొంతం. రంజీ ట్రోఫీ రెండు సీజన్లలోనే 100 వికెట్లకు పైగా తీసి రికార్డు సృష్టించాడు. ఇటీవల జమ్మూ కశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ గెలుచుకోవడంలో ఆకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ లో 17 ఇన్నిం గ్స్ లలోనే 60 వికెట్లతో అదరగొట్టాడు.
దులీప్ ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌల ర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రదర్శనతో మినీవేలంలో ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ. 8.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం ఆకీబ్ ప్రత్యేకత. దేశవాళీ క్రికెట్‌లో 12 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఢిల్లీ జట్టు బౌలింగ్‌కు ఈ జమ్మూ పేసర్ కీలకం కానున్నాడు.
జడేజాకు వారసుడు
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో వారి టాలెంట్ ను అంచనా వేసి భవిష్యత్తు దృష్ట్యా కోట్లు వెచ్చించేందుకు వెనుకాడదు. దీనిలో భాగంగానే యువ స్పిన్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ వీర్ ను రవీంద్ర జడేజా వారసుడిగా సీఎస్కే భావిస్తోంది. దేశవాళీ టీ20 కెరీర్ లో మంచి రికా ర్డు ఉండడం అతనికి భారీ ధర పలికేలా చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉండడంతో భవిష్యత్తు కోసం అతన్ని సీఎస్కే తీసుకుందని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో చెపాక్ పిచ్‌లపై ప్రశాంత్ వీర్ చెన్నై కి కీలకం కానున్నాడని అంచనా వేస్తున్నారు.
యంగ్ హిట్టర్
ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు దొరికిన మరో ఆణిముత్యం కార్తీక్ శర్మ.. 19 ఏళ్ల వికెట్ కీపింగ్ హిట్టర్‌ను సీఎస్కే ఏకంగా రూ.14.2 కోట్లకు దక్కించుకుంది. ఇంత భారీ మొత్తం పెట్టడానికి కారణముంది. టాపార్డర్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతని సొంతం. రంజీ సీజన్ లోనూ, విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. అతని సిక్స్ హిట్టింగ్ ఆకట్టుకోవడంతోనే సీఎస్కే భారీ ధరకు తీసుకుంది. పవర్ ప్లేలో కార్తీక్ శర్మను చెన్నై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఫినిషర్ గానూ వాడుకునే ఛాన్సుంది.
టెన్నిస్ బాల్ టాలెంట్
ఐపీఎల్ లో ఆర్సీ బీ కొనుగోలు చేసిన టాలెంటెడ్ బౌలర్ మంగేశ్ యాదవ్... తన స్కౌట్ నెట్ వర్క్ ద్వారా మంగేష్ ను గుర్తించిన ఆర్సీబీ వేలంలో అతన్ని రూ.5.2 కోట్లకు దక్కించుకుంది. ట్రక్ డ్రైవర్ కొడుకైన మంగేశ్ మధ్యప్రదేశ్ టీ20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆరు మ్యాచ్‌లలోనే 14 వికెట్లు తీసాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ మెరుగైన రికార్డు ఉన్న ఈ పేస్ బౌలర్‌ను ఆర్సీబీ తమ పేస్ ఎటాక్‌లో భాగం చేసుకుంది.




