27 March, 2026 | 3:07 AM

ఘోర బస్సు ప్రమాదం

27-03-2026 01:24 AM
  1. తెల్లారెలోపే అనంతలోకాలకు 
    1. కంకర లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 
    2. 14 మంది సజీవ దహనం

* ఆకాశంలో ఇంకా నక్షత్రాలు మెరుస్తూనే ఉన్నాయి. వారంతా బస్సులో గాఢ నిద్రలో ఉన్నారు. మరికొద్ది గంటల్లో సూర్యుడు ఉదయిస్తాడనగా, వారి జీవితాలను చీకటి మింగేసింది. కళ్లు తెరిచి ఉదయాన్ని చూస్తారనుకున్న వారు, నిద్రలోనే అగ్నికి ఆహుతులయ్యారు. ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణాన్ని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి మాంసపు ముద్దలుగా మిగిలారు. చీకటిలోనే మొదలైన ప్రయాణం.. చీకటిలోనే ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం, కేవలం ప్రాణాలనే కాదు.. ఎందరో ఆశలను, మరెన్నో కుటుంబాల అనుబంధాలను మట్టిలో కలిపేసింది. 

  1.   28 మందికి గాయాలు
  2. మృతుల్లో 5 నెలల చిన్నారి
  3. బతుకుదెరువుకు తెలంగాణ వచ్చి స్వగ్రామాలకు వెళ్తూ 8 మంది మృతి
  4. కొడుకును కిటికీలోంచి తోసి, తల్లి మృతి 
  5. ఏపీలోని మర్కాపురం జిల్లా రాయవరం పలకల క్వారీల వద్ద ఘటన
  6. జగిత్యాల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటలకు 41మందితో బయలుదేరిన బస్సు
  7. ఏపీలోని నెల్లూరు జిల్లా కనిగిరికి ప్రయాణం
  8. బస్సు స్టీరింగ్ స్ట్రక్ కావడంతో ప్రమాదం!
  9. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం మోదీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్

హైదరాబాద్/జగిత్యాల, మార్చి 26 (విజయక్రాంతి): ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తెలంగాణలో ని జగిత్యాల జిల్లా, నిర్మల్ జిల్లాకు బతుకుదెరువు కోసం వచ్చిన ప్రజలు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు వారి స్వగ్రామాలకు జగిత్యాల నుంచి బయలుదేరారు.

మొత్తం 41 మందితో ఏపీలోని నెల్లూరు జిల్లా కనిగిరికి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున 6, 6.30 ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్దకు బస్సు చేరుకుంది. ఆ సమయంలో చీమకుర్తి నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ను పలకల క్వారీల మలుపు వద్ద బస్సు ఢీకొట్టింది. బస్సు నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో అది పేలి మంటలు వ్యాపించాయి.

దీంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో నిద్ర నుంచి మేల్కొనేలోపే బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. చాలామంది ప్రయాణికులు కిటీకి అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. స్లీపర్ బస్సు కావడంతో బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మృతుల్లో ఎక్కువ మంది బస్సు వెనుక భాగంలో స్లీపర్ బెర్తులపై ఉన్నవాళ్లేనని తేలింది. మృతుల్లో 5 నెలల వయస్సున్న చిన్నారి ఉంది.

ఘటనాస్థలికి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 13 మంది మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. జగిత్యాల నుంచి బయల్దేరిన వారిలో ఏడుగురు నిర్మల్ జిల్లా నుంచి వెళ్లిన ఒకరు మృతి చెందారు. రాంగ్ రూట్‌తోపాటు బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదానికి గంట ముందే బస్సుకు రిపేర్లు చేసినట్టు తెలుస్తున్నది.

మృతుల వివరాలు

అంబటి అనిల్, అంబటి అనిల్ కుమారుడు (5 నెలలు), బండారు పద్మ, ముత్తంగి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిరి మహేంద్ర, ఎన్ ప్రభావతి, కత్తి జయరాములు, చిన్ని, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి ఉన్నారు. 

ఎటు చూసినా మాంసపు ముద్దలే

ఘటనా స్థలంలో ప్రమాద దృశ్యాలు గుండెలు పగిలేలా ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీయగా.. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలను చూసి రెస్క్యూ సిబ్బందితో సహా స్థానికులు గగుర్పాటుకు గురయ్యారు. మృతులను కుటుంబసభ్యుల డీఎన్‌ఏ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి గంట ముందే ట్రబుల్

బస్సు కండీషన్ బాగాలేదని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రమాదానికి ముందు బస్సును డ్రైవర్ యర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపి మరమ్మతులు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయానికి గంట ముందు కూడా బస్సు ట్రబుల్ ఇచ్చిందని, దాంతో గంటసేపు బస్సును నిలిపివేసి రిపేర్లు చేశారని, ఆ తర్వాత ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగినట్లు మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సుపై రూ.36 వేల జరిమానా ఉన్నదని అధికారులు వెల్లడించారు. 

బస్సు కండీషన్ బానే ఉంది: క్లీనర్

బస్సు ప్రమాదం నుంచి మొదటగా ప్రాణాలతో బయటపడింది తానేనని క్లీనర్ మహేంద్ర తెలిపారు. ‘ప్రమాద సమయంలో నిద్రపోతున్నానని, లేచి చూసేసరికి బస్సు మంటల్లో చిక్కుకున్నదని తెలిపారు. వాటిని చూసి తాను కిందకు దూకినట్టు చెప్పాడు. అయితే మంటల్ని నియంత్రించే సిలిండర్లు బస్సులో ఉన్నాయని, అప్పటికే మంట లు దట్టంగా వ్యాపించాయని చెప్పాడు. చాలామంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారని చెప్పాడు. అయితే బస్సు కండీషన్ బాగానే ఉందని మహేంద్ర తెలిపాడు. 

రెండు వాహనాలు రాంగ్ రూట్‌లోనే!

ఘటన జరిగిన సమయంలో బస్సు, టిప్పర్ రెండూ రాంగ్ రూట్లో ఉన్నాయని మార్కాపురం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. టిప్పర్ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రమాదా నికి ముందు బస్సు స్టీరింగ్ స్ట్రక్ అవ్వడంతో అదుపుతప్పి టిప్పర్‌ను ఢీకొట్టినట్లు డ్రైవర్ చెప్పాడని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామని వివరించారు. 

కొడుకుని కాపాడి తల్లి మృతి

కనిగిరి మండలం తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45) కొడుకు మనోహర్‌తో కలిసి జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామారావుపల్లెకు బతుకుదెరువు కోసం వచ్చింది. బస్సులో ఏపీలోని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరికంటే ముందే బస్సులో మంటలు గమనించిన రమాదేవి ప్రమాద తీవ్రతను ముందే ఊహించి తన కొడుకు మనోహర్‌ను బస్సు కిటికీ నుంచి బలవంతంగా బయటకు తోసేసింది. అప్పటికే మంటలు తీవ్రమవ్వడం, పొగ అలుము కోవడంతో రమాదేవి బయటకు రాలేకపోయింది. బయటపడ్డ కుమారుడు తల్లిని కాపా డాలని ఆర్తనాదాలు చేసినా.. ఎవరూ లోపలికి వెళ్లలేకపోయారు. కన్న కొడుకు కళ్లెదుటే రమాదేవి బస్సులో చిక్కుకుని మంటల్లో కాలి బూడిదైంది. 

నిర్మల్‌కు వచ్చిన వలసకార్మికురాలి మృతి

లక్ష్మణచందా (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టెలుపాడు మండలం అంకగోపాలపురం గ్రామానికి చెందిన పద్మ (35), వెంకట్రావు దంపతులు మూడు నెలల క్రితం బతుకుతెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలానికి వచ్చారు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరితోపాటు మనీ (37), వెంకటయ్య దంపతుల తోపాటు వారి కుమారుడు రోహన్ (10) వచ్చారు. జగిత్యాలలో హరికృష్ణ ప్రైవేటు బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్మ మృతి చెందింది. మనీ తీవ్రంగా గాయపడగా, రోహన్ స్వల్ప గాయాలతో పయటపడ్డాడు. 

ప్రమాదం అత్యంత విషాదకరం

  1. ప్రధాని మోదీ
  2. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు చంద్రబాబు, రేవంత్

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిజయజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.