27 March, 2026 | 3:10 AM

బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది

27-03-2026 01:06 AM

ఇంకా అడుక్కొనే స్థితిలోనే బీసీలు ఉండాలా? 

  1. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీత 
  2. బీసీ రిజర్వేషన్ల విషయంలో మేం చిత్తశుద్ధితోనే ఉన్నాం 
  3. మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం 
  4. అప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉంటాం 
  5. మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి 

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని,  స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా 85 శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంకా అడుక్కునే పరిస్థితిలో ఉండటం దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అధికార, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య గురువారం వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేసిన బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. బీసీలకు పెట్టిన బడ్జెట్‌లో 20 శాతం నిధులు కూడా ఖర్చుచేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

దీంతో మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, సీతక్కతోపాటు ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఎవరి జనాభా ఎంతో ఉందో? ఆ మేరకు రిజర్వేషన్లు ఉండాలనేది రాహుల్‌గాంధీ ఆలోచన విధానమని మంత్రులు పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే.. బీసీలకు రిజర్వేషన్లు అమలుచేస్తామని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. తెలంగాణ చేపట్టిన కుల గణన దేశానికి రోల్‌మోడల్ అయిందని రాహుల్‌గాంధీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేర్చిందని వివరించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఉందని, అసెంబ్లీలో తీర్మానం చేయడం, డెడ్‌కేటెడ్ కమిషన్ వేయడంతోపాటు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.

బీసీ ప్రధానిగా చెప్పుకునే నరేంద్రమోదీ బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ముందుకు రావడం లేదని, కనీసం 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి బీజేపీకి మనసురావడం లేదని విమర్శిం చారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్‌ఎస్ చేసిందేమి లేదని మంత్రి సీతక్క విమర్శించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదో బీఆర్‌ఎస్ చెప్పాలని డిమాండ్‌చేశారు. బీసీలకు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది మోసం చేయడానికి కాదన్నారు.  

బీజేపీకి బీఆర్‌ఎస్ భయపడింది: శ్రీధర్‌బాబు

రాహుల్‌గాంధీ బలహీనవర్గాలకు అండగా ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బలహీనవర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, తప్పును సరిచేయాలని ముందుకొచ్చిన వ్యక్తి రాహుల్‌గాంధీ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము ఢిల్లీలో పోరాటం చేస్తుంటే బీజేపీకి భయపడి బీఆర్‌ఎస్ తమతో కలిసి రాలేదని విమ ర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం  ఇంకా పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేసి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేశామన్నారు. గతంలో రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా తమ ప్రయత్నం చేశామని, చేస్తూనే ఉంటామన్నారు. తమ కమిట్మెంట్‌ను శంకించాల్సిన అవసరం లేదన్నారు.

అమలు చేయడానికి అడ్డంకులేమిటీ?: తలసాని

బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, బడ్జెట్‌లో బీసీలకు నిధుల పెంపు, ఖర్చు పెట్టడానికి అడ్డంకులేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీసీవర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మెయిన్‌స్ట్రీమ్‌లో కాకుండా లూప్‌లైన్ పోస్టులు ఇస్తున్నా రని పేర్కొన్నారు.