పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్, మార్చి 26(విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు, హాస్టల్ అద్దె బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం వారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత ఆరు నెలలుగా బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని వారు తెలిపారు. హాస్టళ్లకు కూరగాయ లు, గుడ్లు, మాంసం, పప్పులు, నూనెలు వం టి నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్న వ్యాపారులకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లకు అవసర మైన సరఫరాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని చాలా బీసీ హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అయితే నెలలుగా అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో భవన యజమానులు హాస్టళ్లను ఖాళీ చే యాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీం తో విద్యార్థుల వసతి, చదువుపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయాయని, దీని వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.




