8 August, 2026 | 2:33 AM

ప్లాస్టిక్ అమ్మకాల ముసుగులో చోరీలు

08-08-2026 12:14 AM

గ్రామాల్లో రెక్కీ.. లక్ష్యం బంగారం

ఒక దొంగ అరెస్ట్.. మరొకరి కోసం గాలింపు

గద్వాల, ఆగస్టు 7 (విజయక్రాంతి): గ్రామాల్లో ప్లాస్టిక్ సామాన్లు విక్రయిస్తున్నట్లు తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి, రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గద్వాల రూరల్ పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాకు చెందిన రితిక్ షిండేను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు సోయెం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 5న జమ్మిచేడు గ్రామంలో జరిగిన రెండు గృహ చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల విశ్లేషణ ద్వారా నిందితులను గుర్తించి, శుక్రవారం ఉదయం గద్వాల రైల్వే స్టేషన్ వద్ద రితిక్ షిండేను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక పాకెట్ కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతున్నట్లు గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్, రూరల్ ఎస్త్స్ర శ్రీకాంత్ వెల్లడించారు.