11 April, 2026 | 2:42 AM

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

11-04-2026 12:49 AM
  1. ఇప్ప పువ్వు, తేనె సేకరణతో మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి
  2. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు.
  3. అంగన్వాడీ కేంద్రాల్లో 
  4. పౌష్టికాహారం పంపిణీ
  5. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 10 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఇప్ప పువ్వు, తేనె సేకరణతో మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని, నిలువ నీడలేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి తీరుతామని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

శుక్రవారం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నారం గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సీ ఆర్ ఆర్ నిధులు 15 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీ సీ రోడ్ల నిర్మాణ పనులకు, అంకంపల్లి గ్రామంలో ఐటీడీఏ ద్వారా 83 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.

అదే గ్రామంలో నిర్మాణం పూర్తి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు మంత్రి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేశారు. స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాల కల్పన పలు అంశాలపై అంగన్వాడి చిన్నారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ  జిల్లా అభివృద్ధి పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మారుమూల ప్రాంతాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

ప్రతి వ్యక్తి నిత్యం యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, జీవనశైలిలో యోగ ఒక దినచర్యగా అలవర్చుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా బండారుపల్లి గిరిజన భవన్ లో ప్రపంచ హోమియోపతి దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టి ఎస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు తదితరులతో కలిసి మంత్రి సీతక్క యోగాసనాలు వేశారు.