పథకం ప్రకారమే పసుపు దొంగతనం
- నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ‘పసుపు’ చోరీ సెగలు
అధికారుల నిర్లక్ష్యమే కారణం దొంగలకు ఇంటి దొంగల మద్దతు
సెక్యూరిటీపై అనుమానాలు రైతుల్లో అగ్రహాజ్వాలలు
నిజామాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి): నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు కళ్లముందే క్వింటాళ్ల కొద్దీ పసుపు మాయమవుతుంటే, మార్కెట్ కమిటీ అధికారులు మాత్రం ’నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారు. తాజాగా బయటపడిన పసుపు చోరీ ఘటన మార్కెట్ యంత్రాంగంలోని లోపాలను, పర్యవేక్షణ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది. చెమటోడ్చి పండించిన పంటకు రక్షణ కల్పించాల్సిన చోట, అధికారుల అలసత్వం దొంగలకు, అక్రమార్కులకు రాజమార్గం చూపుతోంది.
పర్యవేక్షణ శూన్యం.. ఆగడాలు అపారం:
మార్కెట్ యార్డ్లో నిరంతరం పర్యవేక్షణ ఉండాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కమిషన్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నారు. లైసెన్సుల రద్దు వంటి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, రైతుల నష్టానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంలో తాత్సారం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తూతూమంత్రంగా సెక్యూరిటీ నిఘా;
కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే యార్డ్లో సెక్యూరిటీ నిఘా గాలికి వదిలేశారు. సీసీటీవీ కెమెరాలు ఎన్ని పనిచేస్తున్నాయి? సెక్యూరిటీ సిబ్బంది రాత్రి వేళల్లో ఏం చేస్తున్నారు? అనే అంశాలపై స్పష్టత లేదు. క్వింటాళ్ల కొద్దీ పసుపు తరలిపోతున్నా సెక్యూరిటీ కళ్లు కప్పడం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే, రికార్డు స్థాయిలో నిల్వ ఉన్న పసుపు దొంగల పాలయ్యే అవకాశం ఉండేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారుల వైఫల్యంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
పసుపు కొనుగోలు నిలిచిపోయి రైతులు పది రోజులుగా యార్డ్లోనే తిష్టవేసినా, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ, పంటకు భద్రత కల్పించడంలోనూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వేల బస్తాల పంట ఆరుబయట ఉన్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. కమిషన్ ఏజెంట్లపై ఉదాసీనత చూపుతున్నారని, అక్రమాలకు పాల్పడే ఏజెంట్లను వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్పందన కరువు:
పసుపు చోరీ విషయంలో విలేకరులు వివరణ కోరినా, అధికారులు అందుబాటులోకి రాకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
రైతుల డిమాండ్
వెంటనే పసుపు కొనుగోళ్లను పునరుద్ధరించడంతో పాటు, చోరీకి పాల్పడిన వారిని, వారికి సహకరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో తక్షణమే భద్రతను పెంచకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని, ఉన్నతాధికారులను హెచ్చరించి, సర్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మార్కెట్ కమిటీ యార్డులో కేవలం మూడు బస్తాల పసుపు మాత్రమే చోరీ అయిందని ఇందుకుగాను ఒక ట్రేడర్ కు సంబంధించి అయిన వ్యాపార లైసెన్సును కేవలం 7 రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ తెలుపడం కోసమేరుపు.
ఏడు రోజులపాటు సస్పెండ్ చేశాం
నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డులో పసుపు చోరీకి గురైన మాట వాస్తవమే ఈ సంఘటనకు సంబంధించి ఒక వ్యాపారి లైసెన్స్‌ని ఏడు రోజులపాటు సస్పెండ్ చేశాం. మూడు బస్తాల పసుపు చోరీ అయినట్టుగా గుర్తించాం.
- అపర్ణ, నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ సెక్రటరీ




