8 June, 2026 | 2:56 AM

టెండర్ విధానం రద్దు చేయాలి

08-06-2026 01:41 AM
  1. చేనేత వస్త్రాల కొనుగోలులో పాత పద్ధతినే అవలంబించాలి
  2. బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డాక్టర్ తిరునహరి శేషు

హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి): చేనేత వస్త్రాల కొనుగోలులో ఓపెన్ టెండర్ విధానం, ఓపెన్ మార్కెట్ విధానం రద్దుచేసి పాత పద్ధతి జీవో టెస్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి ఆర్డర్ల ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలకి, పాఠశాలలకి, హాస్టల్స్ కి, గురుకులాలకి, సొసైటీలకి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ఓ లేఖలో ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులను ఆదుకోటానికి 2024లో ప్రభుత్వం జీవో 1ని జారీ చేసి చేనేత రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానం ద్వారా కొనాలని విద్యాశాఖ భావించటం వలన దరిదాపు 50 వేల మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని శేషు కోరారు. చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించకుండా ఓపెన్ టెండర్ విధానాన్ని అవలంభిస్తే చేనేత రంగంలో కార్మికుల ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశం ఉందని, విద్యాశాఖ మంత్రిగా కూడా మీరే వ్యవహరిస్తున్నారు.. కావున విద్యాశాఖ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయవలసినదిగా చేనేత కార్మికుల పక్షాన బీసీ జాక్ మీకు విజ్ఞప్తి చేస్తుందని పేర్కొన్నారు.