8 June, 2026 | 2:57 AM

విద్యను కార్పొరేట్‌గా మార్చిన ప్రభుత్వం

08-06-2026 01:41 AM

బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్

హైదరాబాద్, జూన్ 07 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హక్కుగా కాకుండా, కార్పొరేట్ సంస్థలకు లాభాల వనరుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక భారానికి గురిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండటం బాధాకరమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి పిల్లల చదువుల కోసం ఫీజులు చెల్లిస్తుంటే, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, యూనిఫారాలు, పుస్తకాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని గణేష్ డిమాండ్ చేశారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో అనేక విద్యాసంస్థలు 10 శాతం నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచడం అన్యాయమన్నారు. ఫీజుల పెంపును గరిష్టంగా 8 శాతానికే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంఈవో, డీఈవో అధికారుల  కొరత కారణంగా విద్యా వ్యవస్థపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం సిగ్గుచేటని విమర్శించారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు నియంత్రణ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో అమలు చేసి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఫీజులు పెంచిన విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హరీశ్వర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల ఝాన్సీ, వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.