స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, మే 15(విజయ క్రాంతి) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు, నామమాత్రపు కంటి తుడుపు చర్యేనని సిపిఎం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. దీనివలన రైతులకు జరిగే ప్రయోజనం శూన్యం అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల కనీసం సానుభూతి లేదని మరోసారి రుజువయిందని అన్నారు.
స్వామినాథన్ సిఫారసులను అమలు నమోదు చేస్తానని, పదేపదే చెప్పి, రైతులను నమ్మించి మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిన, హామీని నిలబెట్టుకోలేదని, ఇంతకంటే నమ్మకద్రోహం మరొకటి లేదన్నారు. రైతుల పెట్టుబడి గత ఏడాది కంటే వేలల్లో పెరిగితే,10 రూపాయలు, 75 రూపాయలు మొక్కజొన్న,వరికి పెంచటం అంటే రైతులను హేలన చేయటం అవమానించటమే అన్నారు.
ఎంగిలి మెతుకులు విదిలిచినట్లుగా, పెంచిన ధరలను డాక్టర్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేసినట్టుగా చెప్పుకోవటం అంటే,రైతాంగాన్ని మోసం చేయటమే అన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు యిస్తూ, రైతులను నిర్లక్ష్యం చేసే బిజెపికి రైతులు రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులు అమలు జరిగే వరకు రైతుల పక్షాన మేము పోరాడుతూనే ఉంటామన్నారు.






