18 August, 2026 | 4:00 PM

అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు

18-08-2026 03:04 PM

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి

సెప్టెంబర్‌లో పోచారం, లగ్డారం సబ్‌స్టేషన్ల ప్రారంభం

రూ.75 కోట్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, వీధిదీపాలకు అత్యంత ప్రాధాన్యత

క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి

పటాన్ చెరు: అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేదని నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిన గురుతర బాధ్యత తమపై ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, విద్యుత్, విద్య, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల అధికారులతో విస్తృతంగా సమీక్షించారు.

ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.75 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే సమీక్షించారు. ప్రతి పనికి నిర్దేశిత గడువు నిర్ణయించుకొని, ఆ గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

- పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై కొరడా

టెండర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం మంజూరైన నిధులు కార్యాలయాల ఫైళ్లలో ఉండటానికి కాదు ప్రజలకు ఉపయోగపడే పనులుగా మారాలి అని అన్నారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారి స్థానంలో కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

- క్షేత్రస్థాయిలోనే అసలైన సమస్యలు తెలుస్తాయి

అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను స్వయంగా గుర్తించినప్పుడే వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించగలమని తెలిపారు.

- పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

అమీన్ పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలో పారిశుధ్య పరిస్థితులపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త సేకరణ, తరలింపులో సంబంధిత రాంకీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వర్షాకాలంలో చెత్త పేరుకుపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెత్త సేకరణలో ఒక్క కాలనీ కూడా నిర్లక్ష్యానికి గురికాకూడదని, రాంకీ సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది, డిప్యూటీ కమిషనర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి కాలనీలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.

- ప్రతి వీధిలో వెలగాల్సిందే వీధిదీపం

నూతన కాలనీలు, బస్తీల్లో వీధిదీపాల సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని లైట్లను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు.

- కొత్త కాలనీలకు మౌలిక వసతులు

ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో వేగంగా విస్తరిస్తున్న నూతన కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మంచినీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, యూజీడీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదన్నారు.

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో చెరువుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కమిషనర్ వెంకట కిషన్‌ను ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పటాన్ చెరు మండలంలోని మూడు గ్రామాలు, గుమ్మడిదల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత క్రమం రూపొందించాలని, నిధుల కొరత ఏర్పడితే సీఎస్‌ఆర్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

- సెప్టెంబర్‌లో సబ్‌స్టేషన్ల ప్రారంభం

పటాన్ చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం, లగ్డారం ప్రాంతాల్లో నిర్మించిన నూతన సబ్‌స్టేషన్లను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యుత్ శాఖ డీఈ భాస్కరరావును ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, అదనపు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

- క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలకు నిధులు

పటాన్ చెరు, అమీన్ పూర్ సర్కిళ్ల పరిధిలో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.

- పింఛన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలి

చేయూత పింఛన్లకు సంబంధించిన అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత ప్రజలకు అత్యవసరమైన ఈ మూడు అంశాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే నిజమైన ప్రజాపాలన అందించినట్లు అవుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.